Sunday, November 26, 2017

గుండెలో నదులు నింపుకొని... రెండవ భాగం

లీలా మానుష రూపాలు
ఏక పత్నీ వ్రతుడు
ఎవడైనా ఉన్నాడా!
అదే- 
ఒకే సింకార్డుతో...
సెల్ ఫోను వచ్చింది-
వస్తూనే
ఇద్దరినో ముగ్గురినో
వెంటబెట్టు కొచ్చింది...
మాట్లాడుకోటానికి ఒకటి,
మాటలు పంపటానికి ఒకటి,
చూడటానికి ఒకటి,
చూపించటానికి ఒకటి...
ఒకేసారి
ఒకే క్షణంలో
అన్నీ వాడుకోవటం
చాలా కష్టం...
అందుకే
మనిషి కిప్పుడు
కొత్త కోరిక-
బహు రూప కృష్ణుడైపోవాలని!
 పూల తపన
ఎవరొస్తారా ఎపుడొస్తారా
పూ లిద్దామని ఎదురుచూస్తుంటాయి మొక్కలు...
పారిజాతం మొక్కలు మరీ విశేషం...
ఎవరైనా
వచ్చేదాకా కూడా ఆగలేవు,
కష్టపడకుండా తేలిగ్గా ఏరుకుంటారని
పువ్వుల్ని
నేలమీదకు వదిలేస్తాయి...
పూల మొక్కలకు
బరువనిపిస్తాయి పూలు...
ప్రేమ లేక కాదు-
ఎవరికైనా ఇద్దామనే
తపన వల్లే!
పూల బుట్ట
బాగా పూలున్నా యనుకొని
ఆ బుట్టను
నీ బుట్టలో వేసుకున్నావు...
రేపు చూసుకో!
ఆ బుట్టలో పూలుండవు,
నీ బుట్టలోని పూలూ వాడిపోతాయి.

సూర్యుడికి తోడుగా మరో సూర్యుడు
ఒంటరి సూర్యుడికి తోడుగా
మరో సూర్యుడిని సృజించాలని
వాళ్ల కోరిక...
ఒకడు
పురాతన సౌధాలలో
పడిపోతున్న తల
నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు...
మరొకడు
పాశ్చాత్య సముద్రాలలో ఈదుతూ
ఎండిపోయిన తలను
పదునుపెట్టుకుంటున్నాడు...
ఇంకొకడు
చిక్కు చీకటి అరణ్యాల్లోకి పోయి
చిక్కిపోయిన తల కోసం
వనౌషధుల్ని తింటున్నాడు...
వీడు మాత్రం
జనంలోకి వెళ్ళాడు
జన పథాలలో నడుస్తున్నాడు
మనుషుల గుండెలతో పాటు ప్రయాణిస్తున్నాడు
మనస్సులలో మనసై కలిసిపోతున్నాడు...
వీడి తల
పువ్వంత సున్నితం,
కాయంత కఠినం,
గింజంత దివ్యం...
అంతే- వీడి వల్ల
కొత్త సూర్యుడు పుట్టుకొస్తున్నాడు,
మిత్రుడికి మిత్రుడిగా
సూర్యుడికి తోడుగా...
పండగ దండగ కారాదు
పండగ అంటే
మనసులు పండటానికి...
మండటానికి కాదు...
పూర్వం పండగలు
ప్రకృతి యంత్రంలో మనం
భాగాలని గుర్తు చేసేవి,
పంచ భూతాలు మన ప్రంచ ప్రాణాలని
ప్రకృతికి పూజ చేసేవి...
పండగ అంటే
మనుషుల్ని ఒక చోటకు చేర్చాలి,
మనసుల్ని అందంగా తీర్చాలి,
ఊరుకోసం దేశం కోసం
ప్రపంచం కోసం ప్రకృతి కోసం
మనుషులు బతకాలని పాఠాలు నేర్పాలి...
కొండల మీదో .అడవులలోనో
దేవుళ్ళను పెట్టేవారు,
ఎవ్వరికీ అడ్డం కాని ప్రదేశాల్లో
దేవుళ్ళకు గుడులు కట్టేవారు...
ఇపుడు కొందరు
దేవుళ్ళను లాక్కొచ్చి మరీ
నడిరోడ్లమీదో, కబ్జా స్థలంలోనో గుడి కడుతున్నారు,
ప్రయాణాల కడ్డంగా ప్రజల్ని ఇరకాటంలో పెడుతున్నారు....
ఇపుడు పండగొస్తే వినాయకుడు
ఎవరికీ చెప్పుకోలేని అభాగ్యుడు,
పబ్లిక్ రోడ్ల మీద పందిర్లు వేసి నిలబెడుతుంటే
ట్రాఫిక్ ప్రమాదాల పాపం నాది కాదంటున్నాడు...
దీపావళి వచ్చిందంటే చాలు-
ప్రకృతి కన్నుల్లో
మందుగుండు పొగల కారాలు,
పర్యావరణం గుండెల్లో
ఆటంబాంబు మోతల శూలాలు...
ఏ మతం గుడి అయినా సరే
మైకుల్లోంచి మైకం ప్రవహించరాదు,
ఏ పెద్దోడి కార్యక్రమం అయినా సరే
టపాసుల పిడుగులు ప్రసరించరాదు...
పర్వం అవసరం
విశ్వం పచ్చపచ్చగా వెలుగుతుంటే,
సర్వం అనవసరం
మనసుల్ని మహోగ్రంగా కాల్చుతుంటే...

దీపావళి హెచ్చరిక
స్వార్థం గంధకం
అసూయ పొటాషియం
చీకటి తలపులు రాళ్లు... 
కలిపేసుకున్నా వనుకో!
నీ బతుకొక 
అందమైన టపాకాయ...
నీ సోకు
మరీ మరీ చూసుకొని
మిడిసిపడకు!
తక్షణ కాంతి లాభం కోసం
వాడెవడో
నిన్ను అంటకాగుతాడు,
అంతే-
పేలిపోతావు!

దీపావళి వెలిగించండి
ఇల్లు అందంగా ఉండాలని
ఇష్టం చీపురై ఊడుస్తుంది,
తపన తడిగుడ్డయి తుడుస్తుంది...
గుడి శుభ్రంగా ఉండాలని
ప్రాంగణం అంతా శుభ్రపరుస్తావు,
గర్భగుడి కడుగుతావు, తుడుస్తావు...
నీ దేహమైనా , నీ మనసైనా
ఒక శుభ గృహమే, ఒక పవిత్ర దేవాలయమే...
నీ ఆరోగ్యం కోసం సవా జాగ్రత్తలు తీసుకుంటున్నావు-
బాగుంది కాని
నీ మనసు గర్భ గుడి
అందులో దేవుడున్నాడు...
చెత్తకుప్పలు తొలగించండి,
దీపావళి వెలిగించండి.

నువ్వూ ఉండవు!
మంచి మనసును గిల్లకు,
దేశంలో మొక్కలు పూయవు...
పుణ్య పురుషుడిని తుంచకు,
ప్రపంచంలో చెట్లు చిగురించవు...
వెలుగును మెడ పట్టి ఒత్తకు,
వృక్ష సముదాయం ఒరిగిపోతుంది...
సత్యాన్ని సందుల్లోకి నెట్టకు,
గాలిలో ప్రాణవాయువు తరిగిపోతుంది...
పరుల అన్నంలో సున్నం కలపకు,
భూమికి సహనం నశిస్తుంది...
పాలు తాగుతున్నవాడికి-
అది ఏ రకమైనదైనా సరే
మత్తులో మునగటం నేర్పకు,
విశ్వం మొత్తం కళ్ళుతిరిగి పడిపోతుంది...
అప్పుడు ఏదీ ఉండదు-
నువ్వూ ఉండవు.

ఇదీ మన దీపావళి
రావణుడే సిగ్గుపడేలా
రమణుల గౌరవంమీద గాయాలు చేస్తుంటే
అసలు రావణుడే దూసుకొస్తున్నాడు 
నేటి రావణుల్ని పొడిచేయటానికి...
దుర్యోధనుడిని మరిపించేలా
జూదం వ్యసనాలతో అగ్గి రాజేస్తుంటే
అసలు దుర్యోధనుడే పరుగెత్తుకొస్తున్నాడు
నేటి దుర్యోధనుల్ని పిడిగుద్దులు గుద్దటానికి...
నరకుడిని మించిపోయి
ధరణిని పాలిస్తుంటే
అసలు నరకుడే ముందుకొస్తున్నాడు
నేటి నరకుల్ని నలిపేయటానికి...
అసలు రాక్షసులే కడుపు మండి
అన్యాయంమీద దండయాత్ర మొదలుపెడుతున్నారు...
అసలు బాధితులు కడుపు నిండినట్లు
చీకట్లను కౌగిలించుకొని పడుకొంటున్నారు.

మనసు లెక్క డున్నాయి చెప్పండి!
చంద్ర మండలం దాటి
దూసుకుపోతున్నాం గాని
ఇరుగుపొరుగువారి గుండెల్లోంచి జారిపడుతున్నాం...
విశాల గృహాలు పెద్దపెద్దవి కట్టుకుంటున్నాం గాని
పెద్దల్ని మన చేతల్లోంచి జారవిడుచుకుంటున్నాం...
మేథ, తెలివితేటలు ఆకాశం మించేలా పెంచుకుంటున్నాం గాని
హృదయం పాతాళంలోకి పారేసుకుంటున్నాం...
అంతర్జాలంలో అనుక్షణం
అగణిత మిత్ర సమూహాలతో కలుసుకోగలుగుతున్నాం గాని
ఆపదలో ఆసరా నిలబెట్టుకోలేకపోతున్నాం...
ఎక్కడ పడితే అక్కడ
సమయం తెలిపే యంత్రాలు అమర్చుకుంటున్నాం గాని
సమయం విలువను హీనంగా దిగజార్చుకుంటున్నాం...
వేలాది కొత్త ఔషధాలు విచ్చలవిడిగా కనిపెట్టగలుగుతున్నాం గాని
లక్షలాది కొత్త కొత్త రోగాల్నికావాలని "కొని"తెచ్చుకుంటున్నాం...
అనంతంగా రోజురోజుకు ఆదాయం పెంచుకోగలుగుతున్నాం గాని
ఆవగింజంత మనశ్శాంతి నిలుపుకోలేకపోతున్నాం...
అందంగా బతుకుతున్నాం గాని
ఆనందంగా జీవించలేకపోతున్నాం,
మనుషుల మనుకుంటున్నాం గాని
మనసు లెక్క డున్నాయి చెప్పండి!
కవి "తలంటు"
బక్క చిక్కి
నడుం వంగి
లోక భార మంతా మోస్తున్నట్లు 
ఆకలి బస్తాను భుజాన వేసుకొని
వీధుల వెంటబడి తిరుగుతున్నాడు 
ఇంకా ఈ షాంపూల యుగంలో కూడా 
"
కుంకుడుకాయలు కుంకుడుకాయ" లంటూ...
ఆ ముసలివాడిలో
నాకు కనిపిస్తున్నారు
ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు పాలేకర్,
మానవతకు మాత మదర్ తెరీసా,
దేశాన్ని గుండె మీద మోస్తున్న సైనికుడు,
దేహ సర్వస్వం పొలానికి ఎరువుగా సమర్పించుకుంటున్న కర్షకుడు...
సత్యం ఎప్పుడూ చేదే,
సుఖాలకు ముందు బాధే...
అయినా సరే
భవిష్యత్తులోని పున్నము లన్నీ దూసుకొచ్చుకొనైనా సరే
మనకు రోజూ పున్నమి కావాలి...
సత్యాన్ని సత్యంగా భరించలేం
సత్యానికి అసత్యం రంగులు పులిమితే కొంటాము,
లేదా
సత్యాన్ని పూర్తిగా తీసేసి
అసత్యాన్ని సప్తవర్ణాల్లోచూపుతూ
"
లేబుల్"మీద మాత్రం "సత్యం" అని రాస్తే కొంటాము...
మంచి కవిత్వం చెబితే
ఎవడు వింటాడు!
ఏ తలకాయలకూ నేడు
కుంకుడుకాయ లవసరం లేదు.

కవిత్వం
నన్ను గాయపరచటం
మీకు హాబీ...
నేను గాయపడటం 
నాకు హాబిట్...
అదృష్టం ఏమంటే- 
నా గాయానికి మందు
నా దగ్గరే ఉంది.
నాలుక కోసే దొంగలు
నాలుక కోసే దొంగలు
పెరిగిపోతున్నారు- జాగ్రత్త!
నాలుకంటే నాలుక కాదు-
నాలుక అంటే బుర్ర,
ఒక ఉపకరణం,
ఒక ఆయుధం కూడా...
సొంత నాలుక అంటే సొంత బుర్ర,
సొంత బుర్రతో పనిచేసే ఉపకరణం,
సొంత బుర్రతో శత్రువుల్ని గమనించి
మన కాపు కోసం చేసే ధర్మ యుద్ధం..
ముసుగులు కప్పిన సత్యాసత్యాలనుండి
సత్యాన్ని వెలికితీసి భూమిలో నాటి పెంచి పోషించే పవిత్ర బంధం...
వాణ్ని మనం నమ్ముకొని
ప్రేమగా మన నెత్తి కెత్తుకొంటే
వాడి చేతికి మన ఇంటి తాళం గుత్తు లప్పగిస్తే
వాడేంటిరా బాబూ!
మన సొంత నాలుక కత్తిరిస్తున్నాడు,
పరాయి నాలుక తెచ్చి అతికిస్తున్నాడు...
పరాయి నాలుక అంటే
పరాయి బుర్ర,
వాడి ఉపకరణం మనం వాడితే
వాడి బుర్రతో మనం యుద్ధం చేస్తే
మనకు తెలియకుండా ఓడిపోయేది మనమే,
శాశ్వతంగా గెలిచి మన మీదెక్కి కూర్చునేది వాడే...
ఏదో అవసరమైతే, తప్పకపోతే
సొంత నాలుక పక్కనే
పరాయి నాలుక తాత్కాలికంగా పెట్టుకోవచ్చు కాని
సుఖ జీవన శస్త్రచికిత్స పేరుతో సొంత నాలుక కోసేసి
పరాయి నాలుకల్ని కుట్టేస్తున్న దొంగలు పెరిగిపోతున్నారు...
సొంత నాలుక కోసేసి
పరాయి నాలుక పెట్టుకుంటే
ప్రమాద మేంటో తెలుసా!
పరమాన్నం చేదనిపిస్తుంది,
విషాహారం మధుర మనిపిస్తుంది...
అపుడు దేహం ఏమౌతుందో!
దేశం ఏమైపోతుందో!
పూర్తిగా మన నాలుక కోసేశారంటే
ఇక మనం మనం కాదు-
ఆ దొంగలనే దేవుళ్ళుగా కొలుస్తూవుంటాం
వాడి ఆటబొమ్మలై వాడి చేతుల్లో నిరంతరం ఆడుతూవుంటాం.

ఒక స్త్రీ కోసం ఒక పురుషుడు ఎందుకు హత్య చేస్తాడు!
ఒక స్త్రీ కోసం
ఒక పురుషుడు
ఎందుకు హత్య చేస్తాడు!
అతడి దృష్టిలో
అతడి అనుభవంలో ఉన్న
ఒక ఇల్లు స్త్రీ, ఒక పొలం స్త్రీ, ఒక స్థలం స్త్రీ...
ప్రాణానికి తెగించయినా
కబ్జా చేసినవాణ్ని పొడిచేస్తాడు...
మూడు ముడులు వేసి
ఏడడుగులు నడిచిన
సహ ధర్మ చారిణి పరువు కోసం
మొగుడు రగులుతున్న అగ్ని పర్వతం కావచ్చు...
మనసు పాము కోరల తుపాకీ కావచ్చు...
స్వీయ అర్థాంగం కన్ను గప్పి
ఒక అర్థాంగం అన్య రుచులు మరిగితే
అది దాంపత్యం గుండెకు మేకు కొట్టటమే,
నమ్మకం పెండ్లి పట్టుచీరను నిప్పుల్లోకి వేయటమే...
బయటి పరిమళాల మోజు పెరిగితే
పరస్పరం విడిపోవాలి,
తప్పు చేసిన భార్యను
భర్త నరికితే ఎంత న్యాయమో
తప్పు చేసిన భర్తను
భార్య నరికినా అంతే న్యాయం...
ఇంతవరకు ఇవన్నీ
కలిసిన బంధం వరసలగురించి,
కొంచెం లోతుగా ఆలోచించాలి
ఇంకా ముడిపడని మనసులగురించి...
ఒక కిరణం మరో కిరణం మనసు పడి
కలిసిపోదా మనుకుంటే మాత్రం
సూర్యుడికైనా చంద్రుడికైనా హక్కు లేదు,
ఏ కిరణాన్నయినా నలిపేయటానికి!
అన్ని పువ్వులూ
పండ్లూ కాయలూ కావని చెప్పు!
చాలా పువ్వులు
అత్తరుగా మార్చుకొనటానికో,
తాత్కాలికంగా సువాసనల్ని పీల్చుకొనటానికో అని లోకం గుట్టు విప్పు!
ఫలించని పువ్వులే కావాలని
వాళ్లింకా మొండికేస్తే వాళ్ళదే తప్పు!

రెక్కలు
ఊళ్ళను, నగరాలను నొక్కేస్తుంటే
ప్రాణుల్ని, పొలాల్ని తొక్కేస్తుంటే
కొండలకు రెక్కలు తెగిపోయాయి...
ప్రాణుల చెంతకు పోతూ
ఫలాహారా లిస్తూ
సోమరిపోతులుగా మారుస్తుంటే
రోగాల పాలు చేస్తుంటే
చెట్లకు రెక్కలు విరిగిపోయాయి...
అనంత ఆకాశంలో ఎగురుతూ
అగాధ భూమిపై తిరుగుతూ
అంతరాలు తొలగిస్తూ
ప్రపంచం ఏకం చేస్తూ
పక్షులకు రెక్కలు మిగిలాయి...
దెయ్యాలకు
దేవుళ్ళకు
మనం రెక్క లివ్వకూడదు,
ఒకవేళ వాళ్ళకు రెక్క లున్నా
మనం నరికేయాలి.
మనుషులకు రెక్క లుండాలి,
ఎగిరే రెక్కలు కాదు-
పని చేసే రెక్కలు.
పూజకోసమా పువ్వులు...
గోరు కత్తితో
పువ్వులు కోస్తుంటే
మనస్సు చివుక్కు మంది...
మొక్కలకు నోరిచ్చివుంటే
కోడిలాగాపెద్దగా అరిచేవి
వాటి గొంతు కోసేవాణ్ణి కాదు...
మొక్కలకు భాష ఇచ్చివుంటే
మనిషిలాగా ప్రాధేయపడేవో
శాపనార్థాలు పెట్టేవో
పూజకు పూలు కావని వదిలేసేవాణ్ణి...
నీ పూజ కోసమేనా-
దేవుడా! నిజం చెప్పు!
మొక్కలకు
నోరు, భాష ఇవ్వలే దెందుకు!
"మీకు నేను నోరు భాష ఇస్తే
వాడుకుంటున్నారు మీ కోసం,
నేనిచ్చినా వద్దన్నవి మొక్కలు
మౌనం పాటిస్తున్నవి లోకం కోసం"
ఆకాశవాణి పలికింది
నాలోని మబ్బు తొలగింది.
 పొడిచినా తగ్గని సూర్యుడు
నల్ల మట్టిని తవ్వి
రంగులుగా పండించటమే
సూర్యుడి పని...
అందుకే భాస్కరుడిని
సాయంత్రం రోడ్డుమీద
పబ్లిగ్గా పొడిచేశారు...
అయినా
ప్రభాకరుడు ఊరుకుంటాడా!
పొడిచిన చంద్ర రంధ్రంగుండా
వెన్నెల నెత్తురు వెదజల్లుతూ
చీకటి దిక్కుల్ని వెలిగిస్తూనే ఉన్నాడు.

చంద్రుడికి తిరుగులేదు
కండువా తలకు చుట్టుకొని
గొప్ప పనోడినని చెప్పుకుంటూ
నిన్నొకడు అదే పనిగా 
పాదయాత్రలు చేస్తుంటే 
గొడ్డ లిచ్చాం 
ముళ్ళ కంపల్ని నరకుతాడని...
ముత్తయిదువ లాంటి దేశానికి
విద్యా వైద్యా లనే రెండు కళ్ళు బాగు చేయించాడు కాని
వాడే ఓ ముళ్ళకంపై
దేశాన్ని కౌగిలించుకొని ఆక్రమించటం మొదలుపెట్టాడు...
దారుణ ఘోర ప్రభంజనానికి కొట్టుకుపోయాడు...
పాతపనోడు ఒక డున్నాడు-
గొడ్డలితో వాడు
ముళ్ళకంపల్ని బాగానే నరికాడు,
కాకుంటే మరీ పేట్రేగిపోయి
విచ్చలవిడిగా వీరవిహారం చేస్తున్నాడని
ఇంటికి పంపించారు...
పాత పనోడొస్తే
మళ్ళీ గొడ్డలి చేతి కిచ్చారు,
కానీ ఏమైందో ఏమో గాని
ముళ్ళ కంపల్ని నరకటం లేదు,
గొడ్డలిని కత్తెరగా మార్చి
కంపల్ని అందంగా "ట్రిమ్మింగ్" చేస్తున్నాడు..
మొత్తానికి ఎందుకో భయపడి చస్తున్నాడు...
మళ్ళీ జనం ఆలోచనలో పడ్డారు,
గొడ్డలిని లాక్కొని ఎవడికైనా ఇద్దామంటే
సరైన పనోడు కనబడటం లేదు,
అది తెలిసే కాబోలు
చేస్తున్న పనోడికి జనం గోడు వినబడటం లేదు...
చంద్రుడికి తిరుగులేదు-
ఎవడైనా సూర్యు డొచ్చేదాకా.
రాత్రికి దిగులు లేదు-
చీకటి నరికే పగలు వచ్చేదాకా.

మా ఇల్లూ మా ఆవిడా
వెన్నెల నివాసంగా నిలపాలని
అమృత పుష్పంగా మలచాలని
ఇంటి నెంత తుడుస్తుందో రుద్దుతుందో 
ఇరవై గంటలు రోజుకు ఇంటి సేవలోనే మా ఆవిడ...
ఇల్లును అంత ప్రేమిస్తుంది కాబట్టే
ఇల్లాలు అన్నా రనుకుంటా ఆమెను,
ఇంటికోసం చీపురవుతుంది, తుడిచే గుడ్డవుతుంది
బ్లీచింగ్ పౌడ రవుతుంది, ఫినాయిలవుతుంది,
నా ఇల్లాలి దృష్టిలో ఇల్లంటే ఎప్పుడూ
అప్పుడే పూచిన పూల చెట్టులా ఉండాలి,
ఏ వసిష్ఠ మహర్షి పవిత్రమైన
తెల్లగా వెలిగే గడ్డంలా ఉండాలి...
ఎలాంటి కాలుష్యం అంటని
పూర్వ కాలం నాటి గంగలా ఉండాలి,
శివుడి అత్తగారింటిలోని అందమైన
మానస సరోవరంలోని హంసలా ఉండాలి...
ప్రకృతిలోని సౌందర్యం అంతా
మా ఇంట్లోనే ఉండాలని
దేవుడి గదిలో పూజ చేస్తుంది కాసేపు,
మిగిలిన సమయం అంతా ఆమె
గృహ శిల్ప సౌందర్య నిర్మాణ నిర్వహణలోనే
తపిస్తున్న, తపసు చేస్తున్న నిరంతర మహా శిల్పి...
ఇల్లంటే మా ఆవిడకు
చాలా కాలం ఎదురుచూస్తే పుట్టిన మొదటి బిడ్డ,
ఇల్లంతా కడిగి స్నానం చేయిస్తుంది,
ఇల్లు ఒళ్ళంతా తుడుస్తుంది, పౌడర్ అద్దుతుంది,
చక్కగా కర్టెన్ల బట్టలు మారుస్తుంది...
నా కవితలకోసం మా ఆవిణ్ణి భరిస్తున్నారో
ఆవిడ వంటల కోసం నన్ను భరిస్తున్నారో
వచ్చిన వాళ్ళ నందరినీ విను విను అంటూ నేను,
తిను తిను అంటూ ఆమె...
పని మనిషిని పెట్టుకోవచ్చు గదా అంటారేమో
పని మనిషినే కాదు, ఆ పనిలో నన్ను కూడా
వ్రేలు- కాదు, మా గోరు కూడా తాకనివ్వదు...
టేబుల్ మీద కుర్చీ వేసుకుని దాని మీదెక్కి
అందని పై కప్ బోర్డు తానే తెరవాలి
ఎత్తయిన సీలింగ్ కూడా ఆమే దులపాలి...
ఏ బాత్ రూమ్ కడుగుతూనో పడిపోతే
విరిగిపోయేది ఆమె ఎముకలే కాదు-
ఇంకా ఎన్నో పచ్చని చెట్లు నాటుదామనే
నా కలం కమ్మని కలలు కూడా...
మా ఆవిడ వెన్ను నా పెన్ను,
అది విరిగిందంటే నా ఆశయాల వాకిట్లో,
నా నోట్లో కూడా మన్ను,
మా ఆవిడ ఉనికిలోనే నా మనసు కన్ను,
వేగం
వాయువేగంతో బండి నడిపేది
వాయువుల్లో కలిసి పోటానికే!
మెరుపు వేగంతో కారు నడిపేది
మెరుపులా మాయ మవ్వటానికే!
యమా వేగంతో లారీ నడిపేది
యమ లోకం చేరటానికే!
సూపర్ వేగంతో వాహనాలు నడిపేది
చూపుల కందకుండా పోటానికే!
"హెల్ మెట్" లేకుండా
రోడ్డుమీద కొచ్చేది
"
హెల్" లో బంధుమిత్రుల్ని కలవటానికే!

ఏమీ పట్టని సూర్యుడు
చీకటిలోంచి
మెల్లగా బయటికొస్తున్నవెలుగు విత్తనాల్ని
బలవంతంగా కప్పేస్తోంది నీడ,
వెలుగు ఆకులకు పట్టిన చీడ...
సూర్యు డింకా మేలుకొనే వున్నా
అపార వ్యాపారం నడుపుతూనే ఉంది
సూర్యుడితో శత్రుత్వం ఇష్టపడే నీడ...
ముళ్ళున్నా
గులాబీల దోపిడీ కొనసాగుతూనే...
సూర్యుడున్నా
తెల్లని మేకప్ వేసుకొని
రాజ్యం చేస్తూనే రాత్రి.
అవును, ప్రస్తుతం
ముళ్ళు కావాలనే నిదురపోతూ...
మొలుస్తున్న మోసాల్ని సూర్యుడు తెలిసి కూడా
తన దారిన తాను వెళ్ళిపోతూ...
Top of Form

ప్రపంచాన్ని శుభ్రం చేస్తా రట!
మా దేహాలైనా
మా జీవితాలైనా అపరిశుభ్ర కారణం
మీ మనసుల మురికే గదా...
మేం అగాధాలలో పడిపోటానికి కారణం 
మీరు అకస్మాత్తుగా ఉన్నత శిఖరాలకు చేరటమే గదా...
మీ మనస్సులలో డ్రైనేజీ పారుతూ
దుష్ట క్రిమి కీటకాలు నిరంతరం పెరుగుతూ
మా దేహాల స్వేద పరిమళం మీరే గదా గతుకుతున్నారు,
మీ దేహాల బద్ధకం కంపు మాకేగదా అతుకుతున్నారు...
మీ చీకటి బట్టల్ని వెలుతురుగా మార్చటంవల్లనే గదా
మా బతుకు బట్టలు మురికిపట్టాయి,
మీరు నీటిని గాలిని బలాత్కరించటం వల్లనే గదా
మా కిన్ని సవా లక్ష రోగాలు పెరిగాయి...
మా వాటాల్ని మీరు కొల్లగొట్టి
మమ్మల్ని దొంగలుగా మార్చారు,
మా పాటల్ని మీరు ఎత్తుకుపోయి
మమ్మల్నింకా అడవుల్లోనే నిలిపారు,
మా బతుకుల గొంతుమీద కత్తులు పెట్టి
మా చేతులలో తుపాకులు పెట్టారు...
ఇప్పు డిప్పుడే తెలుసుకుంటున్నాం కారణాలు
ఇక చేస్తాం ఎవరితో నైనా సరే నిత్య రణాలు.
మీదేమో సంపాదన కోసం ఆరాటం,
మా దేమో శుభ్ర జీవన ఆరాటం...
మాకు నవ్వొస్తోంది...
దేశాన్ని మురికి చేస్తూ మీరు
ప్రపంచాన్ని శుభ్ర పరుస్తా మంటుంటే!

బిచ్చగత్తె
కసికసిగా నలిపేసేసరికి
ఒంటి నిండా మడతలు,
దేశంలోని అన్యాయాన్ని చూసి రగిలిపోయి
బూడిదగా మిగిలిన కన్నులు...
నెత్తురు తాగేసి కండలు పీల్చేసి
వ్యవస్థ మిగిల్చిన ఎముకల కొమ్మలు...
వెలలేని చిరునవ్వుల్ని నలిపేసిన
ప్రభుత్వ ప్రసాదాల రాయితీల దైన్యం...
ఎందుకు పుట్టానో ఎందుకు బతుకుతున్నానో
అని చింతిస్తున్న అమాయకత్వం...
శ్రమ స్వర్గాన్నంతా పోగొట్టుకుని
దారిద్య్ర నరకంలోకి నెట్టబడిన దేవదూత

మట్టి బుర్రలు నా కిష్టం
మట్టి బుర్ర లిష్టం,
మట్టి బుర్ర లంటేనే బాగా ఇష్టం,
తేలిగ్గా పగిలిపోయే గాజు బుర్రలు కొన్ని
పచ్చదనం లేని ప్లాస్టిక్ బుర్రలు కొన్ని,
కరకు కసాయి ఇనప బుర్రలు కొన్ని,
జీవం లేని గట్టి రాతి బుర్రలు కొన్ని...
నాకిలాంటి బుర్ర లిష్టం లేదు,
మట్టి బుర్ర లంటేనే నాకు బాగా ఇష్టం...
బంగారం వెలికితీసే గనుల బుర్రలైనా నా కొద్దు,
డబ్బు ముద్రించే యంత్రాల బుర్ర లైనా నా కొద్దు,
అపార వ్యాపార సముద్రాల బుర్ర లైనా నాకొద్దు,
విపరీత అధికార పీఠాల బుర్ర లైనా నా కొద్దు...
ఆలోచన పదాల్ని విత్తనాలుగా వేసుకొని
ఆశయ వాక్య మహా వృక్షాలుగా మారి
ఆచరణ మధుర కావ్య ఫలా లందించే
మెత్తని మట్టి బుర్రలు కావాలి,
ప్రాణ మున్న మంచి మట్టి బుర్రలు కావాలి...
బంగారమైనా డబ్బయినా మట్టి లోంచే గదా వెలికి తీసేది,
వ్యాపారా లయినా అధికారా లైనా మట్టిలోంచే గదా బయట కొచ్చేది...
పాల సముద్రంలోంచి ఎన్ని వచ్చినా
ఎదురుచూసిన అమృతంలాగా
మట్టి లోంచి నా కిప్పుడు కావలసింది
మనిషి, అచ్చమైన మనిషి, మచ్చ లేని మనిషి...
మురికి బుర్రలు తెచ్చి
మట్టి బుర్ర లనకండి,
మట్టి సజీవ చైతన్య ప్రవాహం,
మురికి కదలని దుష్ట నివాసం.
మట్టి బుర్రలు కావాలి,
పచ్చని చెట్టు లాంటి మనిషి నిచ్చే
సుకుమార సుమధుర గంభీర ఉదాత్త హృదయం ఉన్న
వెచ్చని మట్టి బుర్రలే కావాలి. దరిద్రం గట్టిగా పట్టుకొని

చెట్టు పిట్టను కొట్టకు!
చెట్టును కొడుతున్నా వంటే
నీ అయువుపట్టును కొట్టుకుంటున్నావు,
పిట్ట లాంటి చెట్టును కొడుతున్నా వంటే 
నీ రెక్కల్ని నీవు విరుచుకుంటున్నావు...
చిన్నారి బిడ్డ లాంటిది చెట్టు,
బిడ్డ లున్న వాళ్ళెవరైనా
చెట్టును చంపేస్తారా...
దైవ మాత లాంటిది చెట్టు,
దేవుణ్ణి పూజించే వాళ్ళెవరైనా
చెట్టును నరికేస్తారా...
పెంచుతున్న తల్లి లాంటిది చెట్టు,
ఎదుగుతున్న పిల్ల లెవరైనా
చెట్టును కొట్టేస్తారా....
గుండెను నడిపించే కరెంట్ లాంటి
ప్రాణ వాయువు నిస్తుంది చెట్టు,
దేహం నడిపే డీజెల్ లాంటి
ఆహారా న్నిచ్చేది చెట్టు...
ఇన్ని తెలిసి కూడా
చెట్టును కొడుతున్నా వెందుకు,
తెలిసి తెలిసి నీ బతుకును
మంటల సముద్రంలోనికి నెడుతున్నా వెందుకు!
కోరి కోరి పరుగెత్తుతూ
నిప్పుల బావిలోకి దూకుతున్నా వెందుకు!
ఇప్పుడు నీకు తెలిసిందా-
కలం అంటే ఒక చెట్టు,
గళం అంటే ఒక పిట్ట,
చెట్టును పిట్టను నీవు ఏనాటికీ చంపలేవు,
కలాన్ని, గళాన్ని ఏ జన్మకూ కాల్చలేవు.
గౌరీ లంకేష్ ఒక చెట్టూ పిట్టే కాదు,
ఒక కలం, గళమే కాదు,
ప్రజల్ని రక్షించుకోటానికి
పని చేస్తున్న భారత మాత దూత,
చీకట్లను శిక్షించటానికి
మనం నిత్యం స్మరించుకోవాల్సిన భగవద్గీత.

వాగు మీద నా ఫిర్యాదు
మౌనం
దీపం కాదు,
భవిష్యత్తులో శాపం.
తడిసిన నీ మౌనాన్ని వాడు
ఆయుధంగా చేసుకొని
గాలిని ముక్కలుగా నరికి దోచుకొంటున్నాడు
నీటిని చుక్కలుగా మార్చి దాచుకుంటున్నాడు...
చెట్టునో గట్టునో చూసి
మౌన జీవనం ఆదర్శం అనుకోకు,
చేతులు ముడుచుకు కూర్చున్న
మౌనం గురించే నేను మాట్లాడుతున్నాను...
చెట్టు మౌనంగా కనిపించినా
నిరంతర కృషిలో సజీవ ప్రవాహం,
గట్టు నోరెత్తనట్లు అనిపించినా
కట్టడాలలోకి దూసుకువస్తున్న అనంత ప్రయాణం...
మౌనం నిజంగా అలంకారమే,
చేతుల్లో చేతల్లో కిరణాలు జ్వలిస్తున్నప్పుడు,
అరుపులు నా ఉద్దేశం కాదు,
మెరుపుల్ని నిలబెట్టి నడిపించటమే నేను కోరేది...
సూర్యుడి కిరణంలో
రంగులు ఏడు,
కాని మౌనంగా ఉంటూనే
ప్రకృతిలో సహస్ర వర్ణాల్ని అద్దుతున్నాడు చూడు!
మౌనంగా ఉంటావా,
ఉంటే ఉండు,
కాని నీ మనసు నీ బతుకు
జనంలోకి వెచ్చగా ఇంకుతుంటే చాలు,,
మధుర మహా నిశ్శబ్ద రసమయ సంభాషణా కావ్యం రాస్తున్నట్లే.
రొద చేయటం లేదని
వాగును నిలదీయటం లేదు,
నేల మీద ప్రవహించటం లేదనేదే నా ఫిర్యాదు.
ప్రాణాలతో ఇరుక్కుపోయాడు
వాడు గ్లాసునిండా
నీళ్ళు పోసుకున్నాడు-
ఒక అమృతం బొట్టు వేసినా 
ఒక తీయని తేనె బిందువు రాల్చినా 
ఒక మధుర రసం చుక్క పోసినా 
వెంటనే పొర్లిపోతాయి...
అమ్మో... 
మనుషుల కన్నా ప్రేమగా పరచుకొన్న
టైల్స్, మార్బుల్స్ మురికవుతాయి...
వాడి ప్లేటు నిండా
అన్నం మెతుకులు నింపుకున్నాడు-
చుక్కల కూరలు వేసుకోవాలన్నా
సూర్యుడి స్వీటు పెట్టుకోవాలన్నా
చంద్రుడి ఐసుక్రీం ఉంచుకోవాలన్నా
వెంటనే పడిపోతాయి...
మమతల కన్నా కమ్మగా చూసుకుంటున్న
డైనింగ్ టేబుల్, డెకరేషన్ షీట్స్ పాడవుతాయి...
వాడి ప్యాకెట్ నిండా
మరమరాలు తొక్కుకున్నాడు
కందిపప్పు కాని శనగపప్పు కాని
మినప్పప్పు కాని జీడి పప్పు కాని
బాదంపప్పు కాని పిస్తా కాని
ఏ మాత్రం పెట్టినా పొట్లం పగిలిపోతుంది...
ఎప్పటి నుంచో వాడు
తేలికగా దొరికినవో తేరగా దోచినవో
ప్రాణం లేని బొమ్మలను వాడి నిండా నింపుకున్నాడు,
రహదారి అంతా వాహనాలు ఆక్రమిస్తే
కదలలేక బిగుసుకున్న పాదచారిలా
ఆ బొమ్మలతో వాడికి ఊపిరాడటం లేదు...
ప్రాణాలతో విలవిలలాడుతూ
ఎటూ కదలలేక ఇరుక్కుపోయాడు...
ఆధారం
అమృతం అయినా 
ఒక పాత్ర కావాలి,
వెన్నెల కయినా 
ఒక ఆకాశం కావాలి...

ఋషికైనా, సన్యాసికైనా 
ఒక దేహం కావాలి...
భక్తికైనా, దేశ భక్తికైనా 
ఒక దేవుడో ఒక దేశమో ఉండితీరాల్సిందే...

భోగానికైనా రోగానికైనా 
ఒక మనిషి ఉండాలి,
రాగాని కైనా త్యాగాని కైనా 
ఒక మనసుండాలి...

నువ్వొక మనిషి వని 
ఋజువు చేసుకోవాలంటే 
"మొబైల్ ఫోన్" ఉండాల్సిందే,
నువ్వు బతికుండా వని
నలుగురికీ తెలియటానికి 
"స్మార్ట్ ఫోన్" కావాల్సిందే.
నక్షత్రాలని కిందికి దించాలని...
నేను పీలుస్తున్న గాలి 
నేను తాగుతున్న నీరు 
నాకు ప్రకృతి ఇచ్చింది...

నేను తింటున్న తిండి 
నేను కట్టుకుంటున్న బట్ట 
రైతు శ్రామికుడు ఇచ్చారు...

ప్రకృతిని చెరిచేవాళ్ళు
రైతును అరిచేవాళ్ళు 
శ్రామికుడిని కరిచేవాళ్ళు 
నాకు శత్రువులు...

సిగ్గు లేకుండా తలుపేసుకొని 
అంతఃపురంలోకి దూరి
ఆత్మ ప్రేయసితో ఆత్మీయ సంభాషణ 
ఆరంభించను...

ఆకాశం పైకెక్కి 
రెక్కల గంధర్వుల్ని పిలిచి 
విచిత్ర చిత్ర గీతాలు 
పాడను...

నా కలం 
రైతు చేతిలో నాగలి కావాలి,
లేదా సాంకేతికత పెరిగిన 
ట్రాక్టరు కావాలి...

నా కవిత 
పొలానికి కాపలా కాసే 
ముసలి తాత వెచ్చని చుట్ట కావాలి,
లేదా పురుగు మందు చల్లే
ఆధునిక యంత్రం కావాలి...

రాజకీయాల్ని కాల్చేసే 
భోగి మంట కావాలి,
కాలుష్యం అంటని 
మంచి పంట కావాలి...

కొత్త నక్షత్రాలని కనిపెట్టి 
సొంత బీరువాలో దాచుకోలేను,
కళ్ళు నెత్తి కెక్కిన నక్షత్రాలని కిందికి దించి 
పంటలుగా మార్చాలనే మక్కువ నా కెక్కువ.


నిరంతర యోధుడు
సుదీర్ఘ ఖడ్గం పదునైన అంచుకు
భయంకర మహాగ్నిశిఖకు మధ్యలో
నడుస్తున్న మనిషి...

నడవకుండా నిలబడటానికి వీలు లేదు,
ఆగిపోతే కత్తి అంచు పెరుగుతుంది,
అగ్నికీల లింకా రగులుతాయి...
ఆకాశ దేవత లెవరైనా
పైకితీసుకొని
ఆదుకుంటారేమో అని పైచూపులు,
భూ సంచారు లెవరైనా కత్తిని లాగేసి
మంటల్ని ఆర్పేస్తారని
ఎదురుచూపులు...
ముందుకు నడవక తప్పదు-
నైపుణ్యం ఉన్నవాడే గమ్యానికే చేరగలడు...

కాళ్ళను దిక్కుల్లోనికి పెట్టుకొని 
కళ్ళను నేలలోనికి విత్తుకొని
నేను ప్రయాణం మొదలుపెట్టాను,
అంతే...
మంట లాంటి కత్తి పువ్వయిపోయింది,
కత్తి లాంటి మంట నవ్వయిపోయింది.
మౌనం

మౌనం ఎప్పుడూ దీపం కాదు,
భవిష్యత్తులో మానవుడికి శాపం.
నీ మౌనం
వాడు తొడుక్కునే వస్త్రం
దాన్ని రంగురంగుల చొక్కాలుగా మార్చుకొని 
మనల్ని కిందుంచి 
వాడు కుర్చీల మీదెక్కి కులుకుతున్నాడు...
మన కోసం వీస్తున్న గాలిని
దారి మళ్ళించి వాడు లోపలికి పీల్చుకొని
మన కోసం దయ తలిచినట్లు బయటికి వదిలిపెడుతున్నాడు,
మన కోసం పయనిస్తున్న నీటిని
తన అవసరాల చుట్టూ తిప్పుకొన్నాక
ఇది పవిత్ర జల మంటూ మనకే అమ్ముతున్నాడు...
ప్రవేశించటం బయటపడటం
ఇపుడు నేర్చుకోవలసిన పని లేదు,
బాంబులు తయారుచేయటం
పద్మ వ్యూహాన్నిబద్దలుకొట్టటం నేటి విద్య,
కొడవలితో
గడ్డి గొంతు తెగ్గోయనక్కరలేదు,
గొడ్డలితో
చెట్ల కాళ్ళు నరికేయవలసిన అవసరం లేదు...

ప్రొక్లెయినరులు ఉత్పత్తి చేసి
పుడమి గుండె కాయల్ని చీల్చుకొని
నెత్తురు విత్తనాలు తినటం నేటి కళ...
నీ గొంతును నీవే
నీకే తెలియకుండా నులిమేసుకుంటున్నంత మంచివాడివి...
నీ కెంత ఆకలయినా
ఎవడి సొమ్ము తినకుండా
నీకే తెలియకుండా నీ కండలు నువ్వే ముక్కలు చేసుకు తింటున్నంత మర్యాదస్తుడివి ...
అసలు నా కర్థం కాదు-
నీ వెందుకు మనిషిగా పుట్టావో,
నీ వెందుకు బతుకుతున్నావో...
కనీసం చచ్చేటప్పుడైనా
మనిషిగా చావొచ్చుగదా,
నిజాన్ని కనిపెట్టి నలుగురికీ
నోరు తెరిచి చెప్పొచ్చుగదా...
ఒరే మనిషీ, నీ మౌనం
చినుకుల్ని కాల్చుకుతింటున్న అగ్ని పర్వతం,
పువ్వుల్ని నంజుకు తింటున్న మహా రాక్షస వ్రతం.
ఒరే తమ్ముడూ, నా మాట వినరా...
ఒక మాట చెప్పరా...
చీకటి మద్యం సీసాను నీ మాటతో పగలగొట్టి
వెలుతురు ఫలరసాన్ని విశ్వానికి పంచరా...

అహో అమరావతి, అద్భుత ఉగాది...
అహో అమరావతి,
అద్భుత భవనాలను మోసుకొస్తున్న ఉగాదీ, స్వాగతం!
అధికారుల దుర్గంధం 
అవినీతిని మాత్రం పోగొట్టలేకపోతున్నానని 
ఏడుస్తూ వస్తున్న ఉగాదీ... సుస్వాగతం!
మనవడిని కౌగిలించుకున్నంత మధురిమ గల
మామిడి పండును తెస్తున్న ఉగాదికి స్వాగతం...
మదర్ తెరీసా చూపులు మాతృభాష సొగసులు ఉన్న
మల్లెపూలను తెస్తున్న ఉగాదికి స్వాగతం..
పోరాటాలు జరిగేది
జంతువుల మధ్య ఆహారం కోసం,
మనుషుల మధ్య రుచుల కోసం...
అందుకే ఆరు రుచులూ పట్టుకొస్తున్న ఉగాదికి స్వాగతం...
పచ్చని పొలాల్ని తుడిచిపెట్టి,
వెన్నెల సంపదల్ని కట్టబెట్టి
వెలుతుర్ని పండిస్తానని ఊరిస్తూ వస్తున్నది ఉగాది...
మెడలోని పసుపుతాడుకు సూర్యుణ్ణి పసుపుకొమ్ముగా కట్టుకొని
పొలం పని కెళ్ళే తల్లి
ఇపుడు సిమెంటు బస్తాలు మోయటానికి
తాపీగా తాపీపని కొస్తున్నట్లున్నది ఉగాది...
కాలానికి ఆకలి ఎక్కువై భూములూ నదులూ చెరువులూ మింగేస్తుంటే
క్రమ బద్ధీకరణ కబురుతో వస్తున్నది ఉగాది...
పంచదార చల్లి, చీమల్ని బయటకు రప్పించి
చీమల పుట్టలు ఆక్రమిస్తున్న పాముల్ని తరిమేయటానికి రావాలి ఉగాదీ...
తెల్లగా మెరుస్తున్న రాతి చొక్కాల బండల కింద
పెరుగుతున్న పాముల సంతతిని తగలేసే అగ్ని కీలల్ని తీసుకురా ఉగాదీ...
పాత పంచాంగం అస్తమిస్తున్నది, కొత్త పంచాంగం ఉదయిస్తున్నది
మొత్తానికి పంచాంగం మానవ జాతిని ముంచుతున్నది...
మానవ జీవన గమనంలో పంచాంగం ఒక పెద్ద గొయ్యి,
ఏటా వసంతాన్ని మోసుకువచ్చే ఉగాది ఒక మైలురాయి...
చదువుకు డబ్బుకు లంకె తెంచిన రోజు మాకు ఉగాది
రోగానికి పచ్చనోట్లకు బంధం తుంచిన రోజు మాకు ఉగాది...
కులాలు మతాల మత్తులో మేము మునిగిపోతే
వాళ్ళు మా లంగాలు లుంగీలు లాగేసుకొని
బ్లాక్ మార్కెటులో ఓపెన్ గా అమ్ముకుంటున్నారని చెప్పటానికైనా
నువ్వు రావాలి ఉగాదీ...
ఉగాది అంటే బొమ్మ కాదు,
అమ్మ లాంటిది, ప్రేమ చెమ్మ లాంటిది,
సంసారాన్ని భరిస్తున్న కొమ్మ లాంటిది...
పువ్వును ఆయుధంలా భుజం మీద మోస్తున్న పచ్చని రెమ్మ లాంటిది...
ఉగాది అంటే గుండె లేని కత్తి కాదు,
మనసు లేని తుపాకీ గుండు కాదు,
పచ్చని చెట్టు లాంటిది,
కలుపును కరకరా నరికే కొడవలి లాంటిది...
మంచి నీటిని చెలమను తవ్వే గునపం లాంటిది,
నల్లని మట్టిని పసపసా మెత్తన చేసే నాగలి లాంటిది..
అడవిని ఏలుతున్న మృగరాజు కైనా
అవనిని పాలిస్తున్న మహారాజు కైనా
ప్రజా పక్షం వహించే ప్రతిపక్షం కావాలి...
పున్నమి అత్తరు కింద దాగిన చీకటి కంపు నెత్తి చూపే
సత్య ప్రతిపక్షంగా రావమ్మా ఉగాదీ...
తోటల్ని తెచ్చావు, పాటల్ని తెచ్చావు, ఆటల్ని తెచ్చావు...
మనుషుల రూపంలో తిరుగుతున్న మురికి కుప్పల్ని కాల్చిపారేసే
తుపాకీ తూటా తీసుకురా ఉగాదీ...
రైతు చల్లిన విత్తనాలు మొలకెత్తి ఆకలిని నరికేసినట్లు
పోలీసుల చేతుల్లో తుపాకీలు నేరాల గుండెల్లో గుండ్లు దూర్చటానికైనా
రావమ్మా ఉగాదీ,
ఈ వేదిక మీద కవులు వెదజల్లుతున్న వెలుతురు అక్షరాల్ని
నీ గుండెల్లో పంటగా జనానికి పంచటానికి నీవు రావాల్సిందే ఉగాదీ...
        ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో కవిత చదివాను...29.3.17 విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో...
 
వాడు ఆకాశంలో... వీడు నేల మీద...

వాడు ఆకాశంలో నడవటం నేర్చుకున్నాడు
చుక్కలూ చంద్రుడితోనే కలిసి తిరుగుతున్నాడు 
కొత్త కొత్త ఆటలతో గమ్మత్తయిన పాటలతో 
నింగిలో కుర్చీ వేసుకొని కులుకుతున్నాడు...
పుట్టింది నేలమీదే అయినా 
బతుకుతున్నది మట్టిమీదే అయినా 
తినటం, తాగటం అయిందంటే చాలు
రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతాడు...
నింగిలోని రంగులలో మునిగిపోతాడు...
వాడి గగన నైపుణ్యం చూసి అద్భుతం అంటూ
అనుచరులు చప్పట్లు కొడుతుంటారు...
ఆకాశ సభ లేవో వాళ్ళు మునిగిపోయి కూడా
అవని మీద నడిచేవాళ్ళను అపహాస్యం చేస్తుంటారు...
ఘోష యాత్ర నెపంతో పాండవుల్ని
అవమానిస్తున్న కౌరవుల విలాసాలు వాళ్ళు...
వీడు నడిచేది నేలమీదే,
వీడు బతికేది మట్టి మీదే,
మనుషులలో మనసులలో కలిసివున్నాడు...
పక్షులతో మృగాలతో ఆడుతున్నాడు...
భూమిని మనోహర స్వర్గంగా నిలిపివుంచటానికి
మనసును తనువును చీకటి గాయపరుస్తున్నా
చుక్కల్ని తుంచుకొచ్చి జనంమీద పోస్తున్నాడు...
వెన్నెలను పిండుకొచ్చి ప్రజలకు పంచుతున్నాడు,
గాలి, నీరు నిప్పూ ఉన్న
నేలను మించిన స్వర్గం ఉందా!
నేలను మించిన జీవ చైతన్య సింహాసనం
నింగిలో దొరుకుతుందా!
పులులు జనం మీదికొచ్చి పడుతుంటే
ధనుస్సు నందుకొని దూసుకెళ్ళే ధనుంజయుడిలాంటి వాడు వీడు...
వాడికి వీడికి ఒకటే తేడా...
అభిమానం నటిస్తాడు కాని
వాడికి సూర్యు డంటే విపరీత భయం,
ఎండ వేడిమికి ఎంత ఇబ్బంది పడుతున్నా
వీడు సూర్యుణ్ణి ఎప్పుడూ గుండెలతోనే పట్టుకుంటాడు.


సందేశం
నాలుకతో
హృదయాన్ని గాయపరచొద్దు...
మృదువుగా ఉండాలని గదా- 
నాలుకకు  
ఎముకలు లేవు.


హైవే మీద కుక్కపిల్ల
తెల్లని బంతిపువ్వు
నవ్వే మల్లెపువ్వు నెత్తురోడుతాయా...
తెల్లని మేఘ మాలికలోంచి 
వెలిగే ఆనంద డోలికనుంచి 
ఎర్రెర్రని రక్త ధారలు స్రవిస్తాయా...
ఎవడు దేంతో గుద్దిపోయాడో కాని
తెల్లగా అందంగా మెరిసే ముద్దుముద్దు కుక్కపిల్ల
హై వే మీద పడి చచ్చిపోయింది,
పొట్టంతా పగిలిపోయి నెత్తురు పువ్వు విచ్చిపోయింది...
ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉన్న
వాళ్ళ యజమాని కూతురు లాంటిదే ఈ కుక్కపిల్ల కూడా,
ఎందుకు రోడ్డుమీది కొచ్చిందో...
అందమైన బొచ్చును చూసి తను ప్రేమించిన
ఎదురింటి ప్రియుడి కోసం బయటకొచ్చిందా ఈ కుక్కపిల్ల,
కాస్త ఆటవిడుపుగా ఉంటుందని
ఇంట్లో చెప్పకుండా షికారు కొచ్చిందా ఈ కుక్కపిల్ల,
ఇంటి పరిసరాలు నచ్చక  పర్యావరణం ఒంటినిండా కప్పుకోటానికి
రోడ్డెక్కిందా ఈ కుక్కపిల్ల..
ఎంతో లోకాన్ని చూడాల్సిన కుక్కపిల్ల
ఘోరంగా దూసుకుపోతున్న లోకం కాళ్ళకింద నలిగిపోయింది...
మొత్తానికి ఒక పిల్ల దీపం ఆరిపోయింది...
నా మనసంతా ఆ దృశ్యంలోకే జారిపోయింది.
అప్పుడప్పుడైనా
కాగితంమీద కలం పెట్టగానే
ఆవిర్భవించే నీ కవిత
విష్ణుమూర్తి అవతారం...
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ
నీ కవిత్వ ప్రయాణం...

మన మీదకు చీకటి మాయ లెన్ని పొడుచుకొస్తున్నా
రాత్రి గుండెలో నీ కవితలు
కనీసం చుక్కలు కావాలి...
కాని గుర్తు పెట్టుకో...
అప్పుడప్పుడైనా
నిండు జాబిల్లిలాంటి ఓ మహత్తర కాంతి కవిత
నీ మనసులోంచి దూసుకురావాలి,
చీకటి గుండెల్ని చీల్చేయాలి,
పున్నమి వెలుగులలో జనం మురిసిపోవాలి...

బంతికోసం పిల్లాడి ఏడుపు
కాలం పిల్లాడు
పొద్దున్నే తెల్లబట్ట లేసుకొని
సూర్య "బంతి" తెచ్చుకొని
ఆడుకోవటం మొదలుపెట్టాడు...
ఆకాశం ఆట స్థలంలో
పగలంతా ఆడుకొని ఆడుకొని
సాయంత్రానికి బంతిని
పడమటి కాలవలో పారేసుకున్నాడు...
బిక్కమొగ మేసుకొని
నిదానంగా నల్ల బట్టలేసుకొని
రాత్రి గదిలోకి పోయి
బంతికోసం ఒకటే ఏడుస్తున్నాడు...
చుక్కలు
వాడి కన్నీటి చుక్కలే...

కాఫీ పెడుతున్న సూర్యుడు
పగిలిన కొబ్బరిచిప్పల మధ్య నీరులా
రెండు కొండల మధ్య నది...
ఈ నది ఇటు రాక ముందు
బహుశా ఈ కొండ ఓ పెద్ద కొబ్బరికాయలా...
లోపల చెట్ల పీచుతో పైన నున్నగా పచ్చగా...
ఈ నదిలో పడి
కొట్టుకుపోతున్నారు మనుషులు
తమ బట్టలు మాత్రం తడవకూడదని
చేతుల్తో పైకెత్తి పట్టుకొని...
శవం కాలిపోయాక
చిన్న దినం చేస్తున్నపుడు
పెట్టిన పిండాల్లా
కాకులకు కనిప్పిస్తున్న బట్టలు...
ఇవేమీ పట్టించుకోకుండా
పాలు పొయ్యిమీద పెట్టి
కాఫీ తయారుచేస్తున్నసూర్యుడు...

నయీం ఒక రోబో
నయీం ఒక రోబో
వాళ్ళ అవసరాలకోసం సృష్టించారు...
కళ్ళిచ్చారు
చేతు లిచ్చారు
కాళ్ళిచ్చారు...
సర్వస్వం ఇచ్చేసారు...
పొరపాటున ఏదో తేడా జరిగింది-
రోబో వాళ్ళకే ఎదురుతిరిగింది
అంతే...దాని పని అయిపోయింది...
రోబో వీర విహారాన్ని
ఇంత ఉత్స్సాహంగా వర్ణిస్తున్న చానెళ్ళు
విస్తరిస్తున్న పత్రికలూ
ఇన్నాళ్ళు ఎటుపోయాయో...
జనం ప్రాణాలు గాల్లో తేలిపోతున్నాయి-
నాయకులకు తీరిక లేదు,
అధికారులకు ఖాళీ లేదు,
పోలీసులకు సమయం లేదు...
ఒక రోబో నేలకూలింది...
దేశం గుండెలో ఇంకెన్ని రోబో లున్నాయో!


కొండ నుండి నది
పొట్టేళ్ల గుంపు కొమ్ములతో
పొడుచుకుంటూ కొండెక్కుతూ...
ఒక కాలు గాలిలో, మరో కాలు కొండమీద పెట్టి
గుర్రాలు పరుగులు తీస్తూ...
రాతి కొండల్లోంచి పొటమరించిన
పూల మొక్కలు గాలికి నమస్కరిస్తూ...
కొండనుండి నది జింకపిల్లలా దూకి
నేల మీద కామధేనువులా మెత్తగా సాగుతూ...
చీకట్లు మెల్లగా నదిలోకి జారుతుంటే
ఆకసంలోంచి సూర్యుడు
నీటి బుగ్గ మీద సుతారంగా గిల్లుతూ...
కొండనుండి జారిపడుతూ రాళ్ళు
అలల గుండెల్ని పగలగొడుతుంటే
రాళ్ల గుండెల్ని నీళ్ళు
అరగదీసి ఇసక పిండి చేస్తూ...
అమ్మ కంటి చూపులా గాలి
నదీ దేహాన్నిఆప్యాయంగా అల్లుకుంటూ...
ఆకాశం కెమెరా మ్యాన్
నదీ హారం ధరించి
పుడమిసుందరి ఫోటోలు తీస్తూ...



ఎత్తుగా ఉండి
నింగికి పయనించటం
కొండ అందం,
లోతుగా ఉండి
ముందుకు కదలటం
నది అందం,
చల్లదనం ఉండి
సకల దిశలకు సాగటం
గాలి అందం...
అందంగా అలంకరించుకొని
భూమిని ప్రేమించటం
ఆకాశం అందం,
ప్రకృతినుండి పాఠాలు నేర్చుకుంటూ
పరమ ఋషి కావటం
మనిషి అందం...

రాళ్ళనుండి సాగే నదిది
కదిలే ప్రయాణం..
నదిని కడుపారా కన్న కొండలది
కదలని ప్రయాణం...

మనుషుల్ని పండిద్డా మనుకుంటే...
నదికి పరుగెత్తటం తెలుసు,
భూమికి నియంత్రించటం తెలుసు...
నది పరుగెత్తుతున్నా 
భూమి నియంత్రిస్తున్నా
ప్రపంచంకోసమే అని
భూమ్మీదున్న ప్రాణికోటికి తెలుసు...
నదికి కింది చూపు,
భూమికి ముందు చూపు...
నదికి విశ్రాంతి మందిరాలుగా
ఆనకట్టలు నిర్మించే మనిషిది పక్క చూపు,
నదిని ముందుకు కదలనీయకుండా
బంధించాలనుకొనే మనిషిది వంకర చూపు-
నెత్తికెక్కిన కళ్ళ పైచూపు...

ప్రపంచంలో మనుషుల్ని
పండిద్డా మనుకుంటే
మనిషి విత్తనాలు దొరకటం లేదు...
మార్కెటులో అన్నీ కల్తీ విత్తనాలే...
చీకటి బొగ్గునుండి విద్యుత్తును తీసినట్లు
మసి మనసులనుండే
మనిషి విత్తనాల్ని వెలికి తీసి
విశ్వ క్షేత్రం సస్యశ్యామలం చేసుకోవాలి.
కల్తీ స్వతంత్రం
అర్థరాత్రి
స్వతంత్రం వచ్చింది,
ప్రజలు నిద్రపోతుంటే
నాయకులు పట్టేశారు,
తెల్లారినప్పటినుండి
ఈ రోజు దాకా ఇంకా
ప్రజలకు అమ్ముకుంటూనే ఉన్నారు...
అసలైన స్వతంత్రం
వాళ్ళ వారసుల కుంచుకొని...
కల్తీ స్వతంత్రం
మార్కెటులో పెడుతూనే వున్నారు.

మనుషుల్లోనే కొందరు దొరికిపోతారు
ఎందుకో కొందర్నిచూడగానే తెలిసిపోతారు-
వారి కళ్ళు
వారిలో పెరుగుతున్న పూలమొక్కల ఆనవాళ్ళు...
చూపులతో పరిమళాలు ప్రసరిస్తూ మనల్ని పరవశింపచేస్తారు...
ఎందుకో కొందర్ని చూడగానే అందిపోతారు-
వారి ముఖం
వారిలో వర్ధిల్లుతున్నరావిచెట్టు, మర్రిచెట్టు, వేపచెట్లకు ఆముఖం...
పలకలిరింపులతో చల్లని నీడనిస్తూ సేదతీరుస్తారు...
ఎందుకో కొందర్ని చూడగానే కలిసిపోతారు
వారి రాక
వారిమనసుల్లోంచి స్రవిస్తున్న తేనెవాక...
అద్భుత సంజీవనియై మనకు ఆరోగ్య గీత మవుతారు..
.
ఎందుకో కొందర్ని చూడగానే వెలిగిపోతారు-
వారి ఉనికి
వారిలోంచి పొడుచుకొచ్చే నక్షత్ర రాశి...
సామాన్యులే అనిపించినా అసామాన్య కాంతి చల్లుతుంటారు..
.
ఎందుకో కొందర్ని చూడగానే దొరికిపోతారు-
వాళ్ళు పైకి తెల్లని పెద్ద మనుషులు
వారిలో లోపల ఎప్పటికీ ఆకలి తీరని పెద్దపులులు...
మనమూ దేశం ప్రపంచం విశ్వం దేవుళ్ళుకూడా వణికిపోతున్నలేడిపిల్ల లవుతాం...

బ్యూటీ స్పాట్
విశ్వం తెల్ల కాగితం మీద
సృష్టికర్త బొమ్మ గీసాడు...
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు...
గ్రహాలూ...ఉపగ్రహాలూ...
నదులూ కొండలూ పొలాలు గీశాక
అందమైన అమ్మాయిలాంటి
బొమ్మ బుగ్గమీద
బ్యూటీ స్పాట్ "పుట్టుమచ్చ" పెట్టాడు...
అదే "మనిషి"
ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉంది
ఆమె నలుపైనా
నవ్వుతుంటే ఎంత మెరుపో
పటికబెల్లం ముక్కలాంటి చంద్రుడు
కనిపించటం లేదేంటి!
ఎవరో చంద్రుణ్ణి ముక్కలుగా పగలగొట్టి
చుక్కలుగా మార్చారేమో!

కాంతుల  హైవేలను
విశాలం చేస్తున్నాయి
మేఘాల ప్రొక్లెయినర్లు,

చీకటి బండకింద
కోమాలో చెట్లు,
ఒంటరితనం ఊబిలో
దిగులుపడుతున్నగాలి...

సూర్యుడికోసం శ్రామికుడో
శ్రామికుడికోసం సూర్యుడో
ప్రపంచంకోసం ఇద్దరు
ముళ్ళలోంచే పొడుచుకొస్తారు...

ప్రతి రాత్రికి
ఒక ఉదయం ఉందనే నమ్మకం
జీవితం.
ఆ హక్కు ప్రజలు మాకే ఇచ్చారు.
సూర్యుడిని గురించి మాట్లాడే హక్కు
చీకటిరౌడీకి లేనే లేదు...
సూర్యుడికి మసి పూసినా మురికి రాసినా 
మేమే చెయ్యాలి,
ఆ హక్కు ప్రజలు మాకే ఇచ్చారు...
వెన్నెల గురించి మాట్లాడే హక్కు
అమావాస్య దొంగకు లేనే లేదు...
వెన్నెల పాలలో కల్తీ కలిపినా
విషాన్ని వెన్నెలగా పంచినా
మేమే చెయ్యాలి,
ఆ హక్కు ప్రజలు మాకే ఇచ్చారు...
సూర్యుడి సంపాదనతోనే
చంద్రుడు బతుకుతున్నాడని చెప్పే హక్కు
ప్రకృతికి లేదు,
సూర్యుడు ప్రజలకు కనపడకుండా
మబ్బులతోనో దుప్పట్లతోనో
మేమే మూసెయ్యాలి,
ఆ హక్కు ప్రజలు మాకే ఇచ్చారు.


ఓ ప్రకృతి దృశ్యం
పగిలిన కొబ్బరిచిప్పల మధ్య నీరులా
రెండు కొండల మధ్య నది...
ఈ నది ఇటు రాక ముందు
బహుశా ఈ కొండ ఓ పెద్ద కొబ్బరికాయలా...
లోపల చెట్ల పీచుతో పైన నున్నగా పచ్చగా...
ఈ నదిలో పడి
కొట్టుకుపోతున్నారు మనుషులు
తమ బట్టలు మాత్రం తడవకూడదని
చేతుల్తో పైకెత్తి పట్టుకొని...
శవం కాలిపోయాక
చిన్న దినం చేస్తున్నపుడు
పెట్టిన పిండాల్లా
కాకులకు కనిప్పిస్తున్న బట్టలు...
ఇవేమీ పట్టించుకోకుండా
పాలు పొయ్యిమీద పెట్టి
కాఫీ తయారుచేసుకుంటున్నసూర్యుడు...


ప్రయాణం
ఉదయం అస్తమయం అనే
రెండు తీరాల మధ్య
ప్రవహించే నది - పగలు,
అస్తమయం ఉదయం అనే
రెండు కొండలమధ్య
లోతైన అడవి - రాత్రి...
రాత్రికి పగలుకు మధ్య
మనిషి జననం,
పగలుకు రాత్రికి మధ్య
మనిషి మరణం...
ఒక జననం నుండి
ఒక మరణం దాకా సాగేది
వెలుతురు జీవితం,
ఒక మరణం నుండి
ఒక జననం దాకా జరిగేది
చీకటి పోరాటం.


రైతు ప్రయాణం
సూర్యుడు
పడమటి సంధ్యకు ఎర్రచీర పెట్టాడు,
పడమటి సంధ్య
రాత్రికి నల్లచీర పెట్టింది,
రాత్రి
తూర్పు సంధ్యకు నారింజ చీర పెట్టింది,
తూర్పు సంధ్య
సూర్యుడికి తెల్లపంచెలు పెట్టింది...
ఇప్పుడు సూర్యుడు
ఎద్దులని తోలుకొని
కిరణాల ముల్లుగర్రతో
పొలం మీదికి బయలుదేరాడు...


 నల్ల ధనం
"అండర్ గ్రౌండు"లో
గడ్డకట్టిన చల్లదనాన్ని
పగలగొట్టి పంచటం మొదలుపెడితే 
ప్రపంచంలో 
వడగాలే ఉండదు.

ఎవ డబ్బ సొమ్మని దానం చేస్తావురా...
ఎవడబ్బ సొమ్మని
గంగిగోవులాంటి ఊరి చెరువును
నీ అధికారం ఉక్కుపాదాలతో తొక్కేసి
నీ పేరుతో ఒక కాలనీ పెట్టి
నీకు ఓట్లేశారని వాళ్ళకు కట్టబెట్టావు,
నీ పెండ్లాం సుక్షేత్ర భూమిలో 
వాళ్లకు ఇళ్లు కట్టించి ఇస్తే బాగుండేది...
పైగా ఇపుడొచ్చి ఇంకుడు గుంటలు తవ్వుతా నంటావా...
ఎన్ని ఇంకుడుగుంటలు తవ్వితే ఒకచెరువవుతుందిరా!
చక్కగా ప్రవహిస్తున్న కాల్వగట్టుల్ని
నీ సొంత జాగీరుగా నీ కోటేసిన వాళ్లకు రాసిచ్చావు,
ప్రవాహాల కాళ్లు విరిగిపోయాయి,
లక్ష్యాలు ఎండిపోయాయి,
నీ కూతురు పేరుతో ఉన్న పొలాల్ని
వాళ్లకు దానం చేసి ఇళ్ళు కట్టిస్తే బాగుండేది,
పైగా ఇపుడొచ్చి ఇంకుడు గుంటలు తవ్వుతా నంటావా,
ఎన్ని ఇంకుడు గుంటలు తవ్వితే ఒక పెద్ద కాల్వ అవుతుందిరా!
ఇంకుడు గుంటలు తవ్వటం తప్పు కాదురా,
నువ్వు ఒక డ్రామాగా ఇంకుడు గుంటలు తవ్వటమే నేను తప్పు పడుతున్నారా!
చెరువుల్ని పూడిక తీయిస్తున్నారు,
సంతోషం,,, అలాగే చెరువుల ఆక్రమణలు తొలగించి
ఏ దేవుడి పోలాల్లోనో వాళ్లకు ఇళ్లు కట్టించండి,
ప్రజల ప్రాణ దీపాలతో ఆటాడుకోకండిరా!
కాల్వల్ని లోతు చేస్తున్నారు,
సంతోషం...అలాగే కాల్వల ఆక్రమణలు తొలగించి
మీ ఆస్తుల్ని కేటాయించి కాలనీలు కట్టించి
మీ పేర్లు పెట్టుకొండిరా నాయనలారా!
ప్రాణ నరాలు కోసేసి దేశాన్ని చంపేయకండిరా!
మీరు ఈ దేశానికి నాయకులు,
ఈ దేశాన్ని నంజుకు తింటున్నారు,
నాయకు లంటే దేశం కోసం
తమ తనువును కోసి ఇవ్వాలిరా,,
దేశం తనువును కాల్చుకుతినే క్రూర మంసాహారులు కాకండిరా!
అయ్యలూ, రంగురంగుల నాయకులూ!
చెరువులు, కాల్వల పునరుద్ధరణలో
సైంధవులు కాకండి,
పేదలకు సురక్షిత క్షేత్రాల్లో ఇళ్లు కట్టేదాకా
పోరాటాలు చేస్తూనే ఉండండి...
ఓట్ల కోసం దేశాన్ని దోచే నక్కల్ని గుర్తిద్దాం,
సీట్ల కోసం మన గొంతుల్ని మన చేతులతోనే నొక్కేస్తున్న మాయావుల్ని గమనిద్దాం...
వెయ్యి కోట్ల దేవుళ్ళను పుట్టించిన మనిషి
నీటి బొట్టును పూజించుకోలేకపోతున్నాడు,,
ఒక నది పొరపాటున ఎండిపోయిందంటే
ప్రపంచానికి ఒక అవయవం చచ్చుబడిపోయినట్లే...
నిజం చెప్పాలంటే ఎంత అనుబంధ అత్మీయులైనా
ప్రతి మనిషీ మరో మనిషికి అపరిచితుడే,
ప్రపంచంతో పరిచయం ఉండేది ఒక నదికీ,
నదితో బాగా పరిచయం ఉండేది ఒక భూమికీ,..
భూమితో బాగా పరిచయం ఉండేది ఒక మేఘానికి,
మేఘంతో బాగా పరిచయం ఉండేది ఆకాశానికి...
అన్నిటితో మంచి పరిచయం పెంచుకుంటే మనిషి మిగులుతాడు,
ఉన్న పరిచయాన్ని తెంచుకుంటే తొందరలో పోతాడు.



కవి రైతు
సూర్యుడికంటే ముందే లేచి
సూర్యుడు అస్తమించాక ఇంటికి చేరతాడు...
అవార్డుల కోసం కాదు- అహోరాత్రాలు 
లోకం కోసం పండిస్తాడు...
నిజమైన కవి కూడా అంతే...
రైతులాంటివాడే.

నేను తెలుగువాణ్ణి
"తెలివి" లోని మొదటి అక్షరం,
"
విలువ" లోని రెండవ అక్షరం,
"
వెలుగు" లోని మూడవ అక్షరం...
మూ డక్షరాల పదం
"
తెలుగు" భాష 
తెలివి విలువల వెలుగు...
"మాధుర్యం" లోని మొదటి అక్షరం,
"
మూట" లోని రెండవ అక్షరం...
రెండక్షరాల పదం
"
మాట",
తెలుగు మాట
మాధుర్యం మూట...
"పావురం" లోని మొదటి అక్షరం,
"
తోట" లోని రెండవ అక్షరం...
రెండక్షరాల పదం
"
పాట",
తెలుగు పాట
పావురం తోట.
తెలుగు భాష నా అదృష్టం,
తెలుగు మాట సుస్పష్టం,
తెలుగు పాట నా కిష్టం.
స్పష్టత చాలా దోషం
స్పష్టత చాలా దోషం,
నవ నాగరిక కాలంలో
స్పష్టత చాలా దౌర్బల్యం...
మనసు, మనిషి స్ప్పష్టత దోషం,
ఆలోచన, ఆశయం స్పష్టత దోషం,
కవిత్వంలో, కవి వ్యక్తిత్వంలో స్పష్టత మహాదోషం...
సూర్యుడు స్పష్టంగా ఉదయించటం దోషం,
చంద్రుడు పున్నమికి స్పష్టంగా వెలగటం దోషం,
చుక్కలు బాగా ప్రకాశించటం దోషం,
మొక్కలు రోజురోజుకు స్పష్టంగా ఎదగటం దోషం...
సూర్యుడు ఇంకా ఉదయించకుండా
చీకటిలో చిక్కుకుపోయి ఉంటేనే సౌందర్యం,
చంద్రుడు పున్నమికైనా
కరిమబ్బులవెనకే ఇరుక్కుపోయి ఉంటేనే సౌందర్యం,
చుక్కలు నింగిలో ఉన్నాయో లేవో అని
కళ్ళు చించుకొనేలా చేస్తేనే సౌందర్యం,
పరిమళాల పూ లిచ్చే వేవో
తెలియకుంటేనే ఆ మొక్కలకు సౌందర్యం...
మన కమ్మే వస్తువు ఎంత బరువుందో
మనకు స్పష్టంగా తెలియకుండా
అమ్మే కిరాణా వ్యాపారం సౌందర్యం,

మన నెత్తిమీద చేతులు పెడుతున్నాడో
మహనీయ కిరీటం పెడుతున్నాడో తెలియకుండా
మన లోకి చొచ్చుకుపోయే లౌక్యం సౌందర్యం...
మన కన్న తల్లి ప్రేమలో స్పష్టత దోషం,
ప్రేమిస్తున్నదో లేదో తెలియకుంటే ప్రేయసి సౌందర్యం,
మన మాతృభాషా వ్యవహార స్పష్టత దోషం,
బొక్కబోర్లా పడ్డా పరభాషలో అస్పష్టంగా ఏడిస్తేనే సౌందర్యం,
మహానంది కోనేరులో పడిన రూపాయిబిళ్ళలా
నాయకుడి మనసు తెలిసిపోతుంటే దోషం,
మనల్ని కౌగిలిస్తున్నాడో గొంతు పిసుకుతున్నాడో
దేశానికి ఊపిరి తీస్తున్నాడో పోస్తున్నాడో స్పష్టంగా తెలియకుంటేనే సౌందర్యం...
భావకవులు, అభ్యుదయకవులు,
విప్లవకవులు, దళితకవులు, స్త్రీవాద కవులు,
సంఘసంస్కరణ కవులు, అవినీతివ్యతిరేకకవులు
మనిషికోసం విశ్వంకోసం రాసిన కవిత్వం అంతా దోషం,
తలను పెంచుకోనేది కాకుండా
తలను గోడకేసి
పగలగోట్టుకోనేలా చేసే కవిత్వం మహా సౌందర్యం.

కవి అంటే సూర్యు డొక్కడే
ప్రపంచంలో ఎవడూ కవి కాదు,
కవి అంటే సూర్యు డొక్కడే...
లేచీ లేవగానే భూమి మీద
మొక్కల అక్షరాలతో
పువ్వుల కవితలు రాస్తాడు...
కొండల మీద వృక్షాక్షరాలతో
పచ్చని కవితలు రాస్తాడు...
పొలాల మీద రైతుల అక్షరాలతో
పంటల కవితలు రాస్తాడు...
నదుల మీద నురగల అక్షరాలతో
అలల కవితలు రాస్తాడు...
జీవకోటిమీద దేహాల అక్షరాలతో
ప్రాణాల కవితలు రాస్తాడు...
కవి ఎవడూ
ఎక్కడో అయోమయగోళంలో ఉండిపోడు,
స్పష్టంగా సూటిగా గంభీరంగా బతుకుతుంటాడు,
విశ్వాన్ని బతికించటానికి నిప్పులాగా కాలుతుంటాడు...
అందుకే నేనంటా-
లోకాలన్నిటిలోను
కవి అంటే సూర్యు డొక్కడే.

No comments:

Post a Comment